నా ప్రభుత్వం రాజీనామా చేసింది


1948 సెప్టెంబర్ 17న రేడియోలో
నిజాం ప్రకటన పూర్తి పాఠం
హైదరాబాద్, సెప్టెంబర్ 16(టీన్యూస్):భారత దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా 1948 సెప్టెంబర్ 17 వరకు తెలంగాణలో ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడనే లేదు. ఏడాది కాలం తెలంగాణ ప్రాంతం కొంగలు తొక్కిన మడి మాదిరిగా అల్లకల్లోలమై పోయింది. ఒకవైపున ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆదేశాలతో ఖాసిం రజ్వీ సైన్యాలు తెలంగాణ పల్లెల్లో రాయడానికి వీలులేని అరాచకాలను సృష్టించారు. తెలంగాణ తల్లులను అవమానించారు. అదే సందర్భంలో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో దళాలు, గుత్ప సంఘాలు కాశీం రజ్వీ సైన్యాలను ఎదిరిస్తూ ప్రజల పక్షాన నిలిచి పోరాడాయి. ఈ క్రమంలోనే సెప్టెంబర్‌లో భారత హోంశాఖ మంత్రి సర్దార్ పటేల్ ఆదేశాల మేరకు సైన్యాలు తెలంగాణలో కదం తొక్కాయి. ప్రజాస్వామ్య భారతంలో విలీనం కావాల్సిందిగా ఆనాటి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ నిజాం నవాబును ఆదేశించారు. ఆయన ఆదేశాల ప్రకారం సైన్యాలు తెలంగాణను నాలుగువైపుల నుంచి చుట్టుముట్టాయి. సైన్యాలతో పోరాడలేక నిజాం ప్రభువు మీర్ ఉస్మాన్ అలీఖాన్ భారత ప్రభుత్వానికి లొంగిపోయారు. ఆ సందర్భంగా నిజాం రేడియోలో చేసిన ప్రసంగాన్ని ‘నమస్తే తెలంగాణ’ పాఠకుల కోసం అందిస్తున్నాం.

నా ప్రియమైన ప్రజలారా!
భారత దేశపు గవర్నర్ జనరల్ హిస్ ఎక్స్‌లెన్సీ రాజగోపాలాచారి సూచనల మేరకు ఈ సందేశం తెలియజేయుటకు సంతోషిస్తున్నాను. నా ప్రభుత్వం రాజీనామా చేసింది. ఇక్కడి పాలనను హస్తగతం చేసుకోవాలని భారత ప్రభుత్వాన్ని కోరాను. ఈ నిర్ణయం అంతకు ముందే తీసుకోనందుకు విచారిస్తున్నాను. ఈ సున్నితమైన సమయంలో నేనేమీ చేయలేకుండా ఉన్నాను. మొత్తానికి నా సైన్యాన్ని యుద్ధ విరమణ చేయవలసిందిగా ఆదేశించాను. ఈ విషయాన్ని భారత గవర్నర్ జనరల్ గారికి తెలియజేశాను. భారత సైన్యాలను బొల్లారం, సికింవూదాబాద్‌లోని సైనిక స్థావరాలలో ఉండేందుకు అనుమతిస్తున్నాను. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు, నూతన ప్రధాని నియమించబడే వరకు దైనందిన పరిపాలనా వ్యవహారాల్లో నాకు సహాయపడడానికి ఓ కమిటీని ఏర్పరిచారు. అందులో కింద పేర్కొనబడ్డ సభ్యులుంటారు.
1. హిస్ హైనెస్ బరార్ యువరాజు (సర్వ సేనాని)
2. మేజర్ జనరల్ అహ్మద్ అల్ ఇద్రూస్ (కమాండర్)
3. నవాబుద్దీన్ యార్ జంగ్ (పోలీస్ కమిషనర్)
4. సి. రామాచారి
5. అబుల్ హసన్ సయ్యద్
రవాణా వ్యవస్థ మెరుగయ్యాక నేను, సర్ మిర్జా ఇస్మాయిల్, నవాబ్ యార్ జంగ్, దివాన్ బహదూర్, అరవింద్ అయ్యంగార్ కొత్త పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలో ఈ కమిటీతో చర్చిస్తాం. స్టేట్ కాంగ్రెస్ అధ్యక్షులైన స్వామి రామానంద తీర్థను జైలునుంచి విడుదల చేయాలని నిర్ణయించాం. ఈ కల్లోల పరిస్థితుల్లో స్వామీజీ హైదరాబాద్‌కు సహాయ పడతారని ఆశిస్తున్నాను. అదీగాక స్టేట్ కాంగ్రెస్ కార్యాచరణ సంఘానికి విరుద్ధంగా జారీ చేసిన ఆజ్ఞలు, వారెంట్లను రద్దు చేయాలని ఆజ్ఞాపించాను. ఈ సందర్భంలో సహకరించిన మిత్రుడు కేఎం మున్షీ (భారత ఏజెంట్ జనరల్)కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
Your Ad Here